ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు... దివ్యాంగుల విషయంలో హెచ్‌సీఏ కీలక నిర్ణయం
March 27, 2025
దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లు జారీ చేస్తామన్న హెచ్‌సీఏ
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివరాలతో మెయిల్ పంపాలని సూచన
దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్‌లు జారీ చేస్తామని వెల్లడి
ఈ నెల 22న ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి లభిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) దివ్యాంగుల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లు జారీ చేస్తామని ప్రకటించింది.
ఈ టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివరాలను (పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడ్ డిజబులిటీ ప్రూఫ్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి) pcipl18rgics@gmail.com మెయిల్‌కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌సీఏ వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుక మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాస్‌లు జారీ చేస్తామని తెలిపింది.
కాగా, ఈరోజు లక్నోతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తలపడనున్న విషయం తెలిసిందే. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.