పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల

అట్టారీ బార్డర్ వద్ద పూర్ణం షాను భారత్ కు అప్పగించిన పాక్ ఏప్రిల్ 23న పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పూర్ణం కుమార్ షా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో విడుదల ఆలస్యం గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. పాక్ రేంజర్లు బుధవారం ఆయనను భారత అధికారులకు అప్పగించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ అట్టారీ జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది. "ఏప్రిల్ 23 నుంచి పాకిస్థాన్ రేంజర్ల కస్టడీలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఉదయం సుమారు 10:30 గంటలకు అట్టారీ చెక్ పోస్ట్ ద్వారా భారత్‌కు అప్పగించారు. ఈ ప్రక్రియ నిర్దేశిత ప్రొటోకాల్స్ ప్రకారం శాంతియుతంగా జరిగింది" అని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పూర్ణం కుమార్ షా (40) పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 23న ఆయన పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించారు. కాగా, అంతకు ఒకరోజు ముందే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ కారణంగా పూర్ణం కుమార్ షా విడుదల ప్రక్రియ ఆలస్యమైంది.