తిరుమలలో రద్దీ.. 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
April 25, 2025
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. పిల్లాపాపలతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. శనివారం ఉదయం నాటికి 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని చెప్పారు. కాగా, శుక్రవారం 64,536 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. మొక్కుల రూపంలో భక్తులు రూ.3.37 కోట్లు హుండీలో స్వామి వారికి సమర్పించుకున్నారని వెల్లడించింది.