జగన్ చూసి రమ్మంటే ఇతడు కాల్చి వచ్చేవాడు: పీఎస్సార్ అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు స్పందన
April 22, 2025
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్
పీఏస్సార్ చాలా అనైతిక పనులకు పాల్పడ్డారన్న రఘురామ
తనపై దాడి కేసులోనూ పీఎస్సార్ కీలక పాత్ర పోషించాడని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును ఏపీ పోలీసులు నేడు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అరెస్టుపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. మంగళవారం ఉదయం టీవీలో ఈ వార్త చూసి సంతోషించానని ఆయన అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పీఎస్సార్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని రఘురామ ఆరోపించారు. "జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వ్యక్తి ఇతడు" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నటి జెత్వానీ కేసుతో పాటు, తనపై జరిగిన దాడి కేసులో కూడా పీఎస్సార్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని రఘురామ ఆరోపించారు.
తనపై దాడి జరిగిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఏ2 (రెండో నిందితుడు)గా ఉన్నారని రఘురామ గుర్తుచేశారు. ఆయన అరెస్టుతో చాలా మంది తనకు ఫోన్ చేసి, తన కేసు పురోగతి గురించి అడుగుతున్నారని తెలిపారు. ఇదే కేసులో మరో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ప్రమేయం కూడా ఉందని, వీరిద్దరూ కలిసి తనపై దాడికి వ్యూహరచన చేశారని రఘురామ ఆరోపించారు.
పీఎస్సార్ ఆంజనేయులును అరెస్టు చేసిన తరహాలోనే, తన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవీ సునీల్ కుమార్‌ను కూడా అరెస్టు చేస్తారా అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటివరకు సునీల్ కుమార్‌ను కనీసం విచారణకు కూడా పిలవలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కేసులో విచారణ చాలా నెమ్మదిగా (రోడ్డు రోలర్ వేగంతో) సాగుతోందని, విచారణ ఒకసారి వేగం పుంజుకుంటే ఆగదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
తనపై సుమోటో కేసు నమోదు చేసిన సునీల్ నాయక్ అనే వ్యక్తి బీహార్ నుంచి రావడానికి నిరాకరిస్తున్నాడని రఘురామ తెలిపారు. అలాగే, తన కేసులో వైద్య నివేదికలు తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ను ఇప్పటికే విచారిస్తున్నారని ఆయన వెల్లడించారు. పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టుతో తన కేసు విచారణ కూడా వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు