రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పై జెలెన్ స్కీ షాకింగ్ కామెంట్స్
March 27, 2025
పుతిన్ త్వరలో చనిపోతారని జోస్యం
అనారోగ్యంతో బాధపడుతున్నాడని తమకు సమాచారం ఉందన్న జెలెన్ స్కీ
ఆయన మరణంతోనే యుద్ధం ఆగుతుందని వ్యాఖ్య
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చిందని తమకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల జరిగిన ప్రచారం నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
జెలెన్ స్కీ ఇంకా ఏమన్నారంటే..
‘పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. త్వరలో ఆయన మరణిస్తారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడం రష్యాకు ఇష్టం లేదు. యుద్ధం ఆపేయాలని రష్యాపై ఒత్తిడి తీసుకురావాలి’ అని జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాగా, అమెరికా ప్రతిపాదించిన పాక్షిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ విషయంలో రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రతినిధులు సౌదీ అరేబియా వేదికగా రష్యాతో చర్చలు జరుపుతున్నారు.