కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పీవీ నరసింహారావు ఫొటో

గతంలో పీవీని అవమానించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తప్పును సరిదిద్దుకున్న కాంగ్రెస్ పీవీకి భారతరత్న ప్రకటించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు సంస్కరణలతో మన దేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం విస్మరించిందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన మరణించినప్పుడు కూడా సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన పార్థివదేహాన్ని పార్టీ ప్రధాన కార్యాలయంలోకి అనుమతించలేదు. అంతేకాదు అప్పటి నుంచి ఆయన ఫోటోలను కూడా ప్రధాన కార్యాలయంలో నిషేధించింది. ఆమధ్య పీవీ నరసింహారావుకు బీజేపీ ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పీవీ ఫొటోను హైకమాండ్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని కోట్ల మార్గ్ లో కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. సువిశాలమైన ఆ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానులుగా పని చేసిన వారి ఫొటోలను ఏర్పాటు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల ఫొటోలను పెట్టారు. పీవీ నరసింహారావు వెదురు కుర్చీపై కూర్చున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరొక ఫొటోలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ యంగ్ సామ్ ను అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి స్వాగతిస్తున్నట్టు ఉంది. ఏదేమైనప్పటికీ 20 ఏళ్ల తర్వాత ఆయన ఫొటోను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.