'సంక్రాంతికి వస్తున్నాం'- మూవీ రివ్యూ
January 14, 2025
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాగే సినిమా
వినోదప్రధానంగా నడిచే కథాకథనాలు
ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే పాటలు
మరోసారి కామెడీకి పట్టంగట్టిన అనిల్ రావిపూడి
ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే
అనిల్ రావిపూడి - వెంకటేశ్ కాంబినేషన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్ 2' .. 'ఎఫ్ 3' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో ఈ ముగ్గురూ కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టారా లేదా అనేది చూద్దాం.
కథ: యాదగిరి దామోదరరాజు (వెంకటేశ్) ఓ అనాథ. 'రామచంద్రాపురం' గ్రామానికి చెందిన భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చేస్తాడు. ఆ ఇంటికి అతను మూడో అల్లుడు. ఆరేళ్ల క్రితంవరకూ అతను పోలీస్ డిపార్టుమెంటులో పవర్ఫుల్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. తన నిజాయితీకి గుర్తింపు లేని కారణంగా ఆ జాబ్ వదిలేసి, భార్య .. నలుగురు పిల్లలతో హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. పెద్దగా చదువుకోని భాగ్యానికి, తన భర్త అంటే పిచ్చి ప్రేమ. దామోదరరాజు అసాధ్యుడు కావడంతో, తోడల్లుళ్లతో పాటు మామగారికి కూడా మింగుడుపడని వ్యవహారంగా మారుతుంది.
ఇదే సమయంలో బిజూ పాండే - పాపా పాండే అనే ఇద్దరు అన్నదమ్ములు అరాచకాలు సృష్టిస్తూ ఉంటారు. వీళ్లకి బిల్లా నాయక్ - చోటా నాయక్ అనే ఇద్దరు అన్నదమ్ములతో ఆధిపత్యపోరు జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం పాపా పాండే 'చర్లపల్లి జైలు'లో ఖైదీగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ సంస్థకి సంబంధించిన కీలకమైన వ్యక్తి సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ కి వస్తాడు. బిజూ పాండే అతనిని కిడ్నాప్ చేస్తాడు. తన అన్నయ్యను అప్పగిస్తేనే, సత్య ఆకెళ్లను వదులుతానని చెబుతాడు.
ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ముఖ్యమంత్రి (నరేశ్) జోక్యం చేసుకుంటాడు. బిజూ పాండే అధీనంలో ఉన్న సత్య ఆకెళ్లను విడిపించుకురాగల సమర్థుడు దామోదర్ రాజు అని తెలుసుకుంటాడు. అతను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనీ, అతణ్ణి ఒప్పించి తాను తీసుకొస్తానని పోలీస్ ఆఫీసర్ మీనాక్షి (మీనాక్షి చౌదరి) ముఖ్యమంత్రికి మాట ఇస్తుంది. మీనాక్షి రాకపట్ల భాగ్యం ఎలా స్పందిస్తుంది? దామోదర్ రాజును పిల్లల తండ్రిగా చూసిన మీనాక్షి ఏం చేస్తుంది? బిజూ పాండే ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ తోనే, ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటుందనేది దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. సంక్రాంతికి ప్రతి పల్లెటూరు ఒక పండగ కేంద్రంగా కనిపిస్తుంది. రంగుముగ్గులు .. గాలిపటాలు .. ఉమ్మడి కుటుంబాలు .. సరదాలు .. సందళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ అంశాలను కలుపుకుంటూ అనిల్ రావిపూడి తయారు చేసిన కథ ఇది. ఈ అంశం చుట్టూ ఓ లవ్ స్టోరీ .. ఓ కిడ్నాప్ స్టోరీని కూడా ఆయన యాడ్ చేశాడు.
ప్రభుత్వానికి దామోదర్ రాజు వంటి పోలీస్ ఆఫీసర్ అవసరం పడటం .. అతణ్ణి తీసుకెళ్లడానికి ఆ ఊళ్లోకి మాజీ లవర్ ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఇల్లాలు .. ప్రియురాలు తరహా ఇరకాటంలో హీరో పడిన ఘట్టాలను అనిల్ రావిపూడి రాసుకున్న తీరు హాయిగా నవ్విస్తుంది. ఒక వైపున గ్యాంగుల మధ్య గొడవ .. ఇటు భార్య - ప్రియురాలి మధ్య గొడవల నేపథ్యంలో హీరో ఈ ఆపరేషన్ ను కొనసాగించడం వినోదభరితంగా సాగుతుంది.
సాధారణంగా కథ మొదలైన కాసేపటికే విలన్ ఎంట్రీ ఉంటుంది. కానీ ఈ కథలో అక్కడక్కడా నామ మాత్రంగానే విలన్ కనిపిస్తూ, చివర్లో తన ప్రభావం చూపిస్తాడు. భార్య - ప్రియురాలి పట్ల అసహనం ప్రదర్శిస్తూనే విలన్ గ్యాంగ్ ను హీరో ఎదుర్కునే సన్నివేశాలను డిజైన్ చేసుకున్న పద్ధతి బాగుంది. చివర్లో గురువు పట్ల శిష్యులు ఎలా ఉండాలనే విషయానికి సంబంధించి ఇచ్చిన చిన్నపాటి సందేశం, ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.
పనితీరు: దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ సినిమా, మంచి నిర్మాణ విలువలతో ఆకట్టుకుంటుంది. కథ - స్క్రీన్ ప్లేను ప్రధానమైన బలంగా నిలపడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. వెంకటేశ్ కి కామెడీపై ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో ఆయన తన విశ్వరూపం చూపించాడు. ఆయన భార్య పాత్రకి ఐశ్వర్య రాజేశ్ న్యాయం చేసింది. ఇక లవర్ పాత్రలో మీనాక్షి అందంగా మెరిసింది.
వెంకటేశ్ కొడుకు పాత్రను పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా చేశాడు. ఇక నరేశ్ .. వీటీవీ గణేశ్ .. శ్రీనివాస రెడ్డి .. జైలర్ గా చేసిన ఆర్టిస్ట్ ఇలా అందరి పాత్రల వైపు నుంచి కామెడీ వర్కౌట్ అయింది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం మెప్పిస్తుంది. గ్రామీణ నేపథ్యంలోని దృశ్యాలు ఆహ్లాదకరంగా అనిపిస్తూ మనసును పట్టుకుంటాయి. భీమ్స్ బాణీలు ఈ సినిమా సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించాయని చెప్పాలి. ప్రతి పాట .. ఆ తరువాత కథను ఫాలో కావడానికి అవసరమైన ఎనర్జీని అందిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది.
ముగింపు: పెద్దగా విలనిజం వైపు వెళ్లకుండా, కామెడీకి పట్టం కడుతూ అనిల్ రావిపూడి అల్లుకున్న కథ ఇది. వినోదభరితమైన సినిమాకి .. అందునా సంక్రాంతి పండుగ సందర్భంలో వస్తున్న ఒక సినిమాకి ఏయే లక్షణాలు ఉండాలో .. ఆ లక్షణాలను యాడ్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. కామెడీకి అవకాశం ఉన్న ఏ సందర్భాన్ని ఆయన వదులుకోలేదు. ఈ సినిమాతో వెంకటేశ్ .. అనిల్ రావిపూడి .. దిల్ రాజు హ్యాట్రిక్ హిట్ అందుకుంటారనే చెప్పుకోవాలి.