కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ASI


 ఒంగోలు   బెంజ్ న్యూస్

ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది.ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది.