22వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్

దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు 16న మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన ప్రజాప్రభుత్వంలో పెద్దఎత్తున తరలివస్తున్న పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన‌ రెన్యూ పవర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ICE)తో పెద్దఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ. 22వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేశ్‌, రెన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా నడుమ జరిగిన వ్యూహాత్మక చర్చలు ఫలించడంతో ఆరేళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెన్యూ పవర్ ముందుకు వచ్చింది. రెన్యూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు తొలిదశలో రెన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై మొత్తంగా రూ. 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ గా ఆవిర్భవించడమే గాక ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధనరంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న రెన్యూ... ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచక విధానాలతో పెట్టుబడులు పెట్టడం ఆపేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పునరుత్పాదక ఇంధన రంగం మళ్లీ పట్టాలెక్కింది. గతేడాది అక్టోబర్ లో క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను దావోస్ చర్చల్లో మంత్రి లోకేశ్‌ రెన్యూ పవర్ ఛైర్మన్‌కు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు పునరుత్పాదక ఇంధనరంగంలో పెద్దఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేయడమేగాక పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపాయి. దీంతో పునరుత్పాదక ఇంధనరంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి లోకేశ్‌ ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 65వేల కోట్లతో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు రాగా, కనిగిరిలో తొలిప్లాంట్ కు మంత్రి లోకేశ్‌ ఇటీవల భూమిపూజ చేశారు. టాటా పవర్ (7వేల మెగావాట్లు, రూ.49వేల కోట్ల పెట్టుబడి), ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు (రూ.1.86 లక్షల కోట్లు), వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికా (10వేల మెగావాట్లు, రూ. 50వేల కోట్లు), ఎస్ఎఈఎల్ ఇండస్ట్రీస్ (1200 మెగావాట్లు, 6వేలకోట్ల పెట్టుబడులు), బ్రూక్ ఫీల్డ్ (8వేల మెగావాట్లు, రూ.50వేలకోట్ల పెట్టుబడి) తదితర ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా నిలవనుంది.