బౌల‌ర్‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా వైడ్ బాల్ నిబంధ‌న‌ల్లో మార్పులు: షాన్ పొలాక్‌

ఇప్ప‌టివ‌ర‌కు బ్యాట‌ర్ల‌కు మాత్ర‌మే కాస్త‌ ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉన్న వైడ్ బాల్‌ నిబంధ‌న‌లు బౌల‌ర్ల‌కు బెనిఫిట్ ద‌క్కేలా మార్పులు చేయాల‌ని ఐసీసీ భావిస్తోంద‌న్న పొలాక్‌ ప్ర‌స్తుతం ఉన్న రూల్స్ వ‌ల్ల బౌల‌ర్ల‌కు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర‌వుతున్నాయని వ్యాఖ్య వైడ్ బాల్‌ నిబంధ‌న‌ల్లో మార్పుల‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీకారం చుట్టింద‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్‌, ఐసీసీ క్రికెట్‌ క‌మిటీ స‌భ్యుడు షాన్ పొలాక్ పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు బ్యాట‌ర్ల‌కు మాత్ర‌మే కొంత‌మేర ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉన్న వైడ్ నిబంధ‌న‌ల‌ను బౌల‌ర్ల‌కు బెనిఫిట్ ద‌క్కేలా మార్పులు చేయాల‌ని ఐసీసీ భావిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న నిబంధ‌న‌ల వ‌ల్ల‌ బౌల‌ర్లు ఇక్క‌ట్లు ప‌డుతున్నార‌ని షాన్ పొలాక్ అన్నారు. వ‌న్డే, పొట్టి ఫార్మాట్ల‌లో బ్యాట‌ర్లు క్రీజు వ‌దిలి బ‌య‌ట‌కు రావ‌డం చేస్తుంటారు. అలాంటి స‌మ‌యంలో బౌల‌ర్ బంతిని స్టంప్స్‌కు కాస్త దూరంగా వేయ‌డం జ‌రుగుతుంది. ఇక‌నుంచి అలాంటి వాటిపైనా అంపైర్లు దృష్టి పెట్ట‌నున్న‌ట్లు మాజీ క్రికెట‌ర్ తెలిపారు. షాన్ పొలాక్ మాట్లాడుతూ... "ఐసీసీ క్రికెట్ క‌మిటీ స‌భ్యుడిగా నేను ఇదే అంశంపై ప‌ని చేస్తున్నా. బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్ల‌కూ ప్ర‌యోజ‌నం క‌లిగేలా మార్పులు చేస్తాం. ఒక‌వేళ బ్యాట‌ర్ చివ‌రి నిమిషంలో క్రీజ్‌లోంచి బ‌య‌ట‌కు వెళితే బౌల‌ర్ స‌రైన ప్ర‌దేశంలో బాల్ వేయ‌డం క‌ష్టం. ఒక‌వేళ బ్యాట‌ర్ క‌దిలిన‌ప్పుడు... బంతి దూరంగా వెళ్లింద‌నుకుందాం. అప్పుడు ఆ బ్యాట‌ర్ ఎక్క‌డైతే ఉన్నాడో... అక్క‌డి నుంచి బాల్ దూరాన్ని ప‌రిశీల‌న‌లోకి తీసుకోవాలి. అప్పుడే వైడ్ బాల్‌పై ఓ నిర్ణ‌యానికి రావాలి. ఇది ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల్లో ఉంది. ప్ర‌స్తుతం బ్యాట‌ర్ల హ‌వా కొన‌సాగుతున్నందున‌.. బౌల‌ర్ల‌కు మ‌ద్దతుగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ ఆలోచ‌న చేశాం" అని పొలాక్ చెప్పుకొచ్చారు.