పేర్ని నానికి జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్
December 28, 2024
పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నాడన్న జేసీ
మీకు మాత్రమే పిల్లలు ఉన్నారా.. మాకు లేరా అంటూ ఫైర్
అసెంబ్లీలో భువనేశ్వరి గురించి ఎన్ని మాటలు అన్నారు..
మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తురాలేదా అని నిలదీత
రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆరోపణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహిళలు, పిల్లలు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు.. మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు. భార్యాపిల్లలు పేర్ని నానికేనా తమకు లేరా అని నిలదీశారు. వైసీపీ పాలనలో అధికారం చేతిలో ఉందనే ధీమాతో పేర్ని నాని చేసిన అరాచకాలను జేసీ ఏకరువు పెట్టారు. ఏకంగా అనంతపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నాని తనను టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టించారని జేసీ మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలపైనా జేసీ స్పందించారు. పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే నీకెందుకు అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నాకే చేసుకున్నారని గుర్తుచేశారు. విక్టోరియా ఎవరో తెలుసుకోవాలంటే బందరుకో, మచిలీపట్నానికో పోయి అడుక్కోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ మంచోడు కాబట్టి ఊరుకున్నాడు కానీ మనుషులు లేక కాదని హెచ్చరించారు.
‘పవన్ కల్యాణ్ ను, నారా చంద్రబాబును ఎన్నెన్ని మాటలు అన్నారు. అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా..? సీఎం చంద్రబాబు మమ్మల్ని ఆపారు. లేదంటే మా కార్యకర్తలు మీ తాట తీసేవారు. మాకు సభ్యత ఉంది కాబట్టే మీ ఆడవాళ్ల గురించి మాట్లాడడం లేదు. నీ బ్యాటరీ వీక్ అయింది చూసుకో’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.