జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ దినోత్సవం ను బీహార్ రాష్ట్రంలో మధుబని వేదిక కానుంది

గ్రామస్వరాజ్యమే జాతిపితకల 32 వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు నేడు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రంలోని మధుబని నుండి ప్రసంగించనున్నారు జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ దినోత్సవం ను బీహార్ రాష్ట్రంలో మధుబని వేదిక కానుంది సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు కలగకపోవడం వలన గ్రామ స్వపరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమయ్యే సంస్థాగత ఏర్పాటును సూచించవలసినదిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ (జాతీయాభివృద్ధి మండలి) 16 జనవరి 1957లో బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ "ప్రజాస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం" అనే అంశాలతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తూ తన నివేదికను 24 నవంబర్ 1957లో సమర్పించారు. బల్వంత్ రాయ్ గోపాల్ మెహతా కమిటీ సిఫారసులను జాతీయాభివృద్ధి మండలి 1958 జనవరిలో ఆమోదించింది. దానితో వివిధ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు తగిన చట్టాలు చేశాయి. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ (నాగోర్ జిల్లా సికార్ 2వ తేదీ అక్టోబర్ 1959). రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ లో 11వ తేదీ అక్టోబర్ 1959న మరియు 1వ తేదీ నవంబర్ 1959న రంగారెడ్డి జిల్లా, శంషాబాద్లో జవహర్ లాల్ నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టబడింది. ఆనాడు ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు ఉన్నారు. 1959లో స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964వ సంవత్సరంలో నిర్వహించారు. బల్వంత్లాయ్ మెహతా కమిటీ సిఫారసు ప్రకారము ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేక పోవడంతో వాటి పనితీరును సమీక్షించడానికి పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి డిసెంబర్ 1977లో "అప్పటి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం" అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించినది. ఈ కమిటీ 132 సిఫార్సులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించినది. బల్వంతాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటయిన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలనీ, అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటైన (ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక) పంచాయతీ వ్యవస్థలను రెండవ తరం పంచాయతీలనీ పేర్కొంటారు. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్.టి. రామారావు గారు, కర్ణాటక రాష్ట్రాలలో మండల వ్యవస్థను పెట్టారు. శ్రీ పి.వి. నరసింహారావు గారి ఆధ్వర్యములో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించి సెప్టెంబర్ 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు) లకు సంబంధించిన బిల్లును వేరువేరుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించడం జరిగింది. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 22 డిసెంబర్ 1992లో పార్లమెంట్ ఆమోదించింది. అటు తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభలలో ఆమోదంకోసం పంపడమైనది. మెజారిటీ శాసనసభలు (17 రాష్ట్రాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి. భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ ఆ బిల్లులపై 20వ తేదీ ఏప్రియల్ 1993 న సంతకం చేశారు. తద్వారా 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగినది పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ 24వ తేదీ ఏప్రియల్ 1993వ సంవత్సరము నుండి అమలులోనికి వచ్చింది. అందుకే ఏప్రియల్ 24వ తారీఖును పంచాయతీ రాజ్ దినోత్సవంగా భారతదేశమంతటా జరుపుకుంటాము. 73వ రాజ్యంగ సవరణ అమలులోకి వచ్చి ఏప్రియల్ 2025 నాటికి 32 సం||రాలు పూర్తయ్యాయి. పట్టణ మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1వ తారీఖు జూన్ 1993 నుండి అమలులోనికి వచ్చినది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అమలులోనికి వచ్చిన తరువాత ఆ చట్టం ప్రకారం పంచాయతీ రాజు మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 10 మే 1993 నుండి అమలులోనికి వచ్చింది. అంతేకాకుండా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోనే పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు జరిపిన రాష్ట్రం కూడా “కర్ణాటక”యే. ప్రకరణ 243జి పంచాయతీల అధికారములు, హక్కులు, బాధ్యతలను తెలియజేస్తుంది. రాజ్యాంగ పరిధికి లోబడి పంచాయతీల అధికారాలు, హక్కులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక శాసనములను రూపొందించవలెను. స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా పంచాయతీలు మనుగడ సాగించుటకు అవసరమైన అధికారములను వాటికి రాష్ట్ర ప్రభుత్వము బదలాయించవలెను. ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టం (1994) 3 అంచెల వ్యవస్థ. 1) గ్రామ స్థాయిలో - గ్రామ పంచాయతీ (మొదటి అంచెను) దిగువ స్థాయి. 2) మండల స్థాయిలో - మండల పరిషత్ (రెండవ అంచెను) అంటే మధ్య స్థాయి. 3) జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్ (మూడవ అంచెను) అంటే ఎగువ స్థాయికి ఏర్పాటుచేసింది. పెసా చట్టము : 1996 సంవత్సరము - కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరిస్తూ చేసిన చట్టమే "పెసా చట్టం". దిలిప్సింగ్ భూరియా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులతో 1996లో “పెసా" చట్టాన్ని అమలులోనికి తెచ్చారు. పెసా చట్టం మాదిరిగానే గిరిజనులు, హక్కుల రక్షణ కోసం అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ను కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలులోనికి తెచ్చింది. 5వ షెడ్యూల్ ప్రకారము దేశంలోని 10 రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ప్రాంతాలున్నాయి. అవి 1) ఆంధ్రప్రదేశ్, 2) జార్ఖండ్, 3) గుజరాత్, 4) హిమాచల్ ప్రదేశ్, 5) మహారాష్ట్ర, 6) ఒరిస్సా, 7) రాజస్థాన్, 8) మధ్యప్రదేశ్, 9) చత్తీస్ ఘడ్, 10) తెలంగాణ. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ ప్రాంతాలలోని పంచాయతీల సంఖ్య 1207. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల సంఖ్య 28,123. ఇందులో 26,613 పంచాయతీలు నివాస ప్రాంతాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13,344, తెలంగాణాలో 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
భారతదేశంలోని మొత్తం గ్రామాల సంఖ్య 6,68,596 పైచిలుకు. ఇందులో 5,93,731 నివాస ప్రాంతాలు కాగా 44,865 గ్రామాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన మనము గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం తప్పనిసరిగా గ్రామ సభలను జరపాలి. ప్రతిరాష్ట్రం పంచాయతీ దినోత్సవము ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలి. నిజంగా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే గ్రామ పంచాయతీ బలోపేతం కావాలి. భారతదేశంలో సుమారు 2,69,191 గ్రామ పంచాయతీలు కలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని అంశాలను పంచాయతీ రాజ్ సంస్థలకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆయా అంశాలకు సంబంధించిన అధికారులు సంబంధిత శాఖల ఆధీనంలోనే ఉన్నారు కర్ణాటకలో 29 అంశాలను, కేరళలో 29 అంశాలను, మహారాష్ట్రలో 11 అంశాలను, ఒరిస్సాలో 21 అంశాలను బదలాయించడం జరిగినది. రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, డయ్యూ మరియు డామన్లలో కూడా మొత్తం 29 అంశాలను పంచాయతీ రాజ్ సంస్థలకు బదలాయించడం జరిగినది. మన రాష్ట్రంలో కూడా 29 అంశాలను పంచాయతీ రాజ్ సంస్థలకు బదిలీ చేయడానికి కృషి చేసినట్లైతే మన పంచాయతీ రాజ్ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు బలోపేతమై, ప్రజలకు కావలసిన సౌకర్యాలను మరింత సమర్ధవంతముగా చేకూర్చే అవకాశం ఉంటుందని ప్రార్ధన. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలి. అప్పుడే నిజమైన పంచాయతీ రాజ్ దినోత్సవము వచ్చినట్లు అవుతుంది. అప్పుడే బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ చట్టంకు (ఆర్డినెన్స్ ద్వారా) కొన్ని సవరణలు చేసినారు. దేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవమును జాతీయ స్థాయిలో గౌరవ ప్రధాని గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఘనంగా జరుపుతారు. రాష్ట్రాలలో రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు జరుపుతారు. ఏప్రియల్ 24న ఒక పండుగ వాతావరణం ఉంటుంది దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల బలోపేతానికి కృషిచేసిన సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లను, మండల పరిషత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు పంచాయతీరాజ్ దినోత్సవమును జాతిపిత మహాత్మాగాంధీ గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించాలని ప్రార్ధన. . జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అవార్డులందుకోనున్న గ్రామ పంచాయతీలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ జాస్తి వీరాంజనేయులు జాతీయ ఉపాధ్యక్షులు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) మరియు ఛైర్మన్ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ & ముఖ్య సలహాదారు, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం బల్వంత్ రాయ్ మెహతా పంచాయతీ భవన్ (దిల్లీ)