నా భర్త ఒక గే.. అతడికి పురుషులంటేనే ఇష్టం!: బాక్సర్ స్వీటీ బూరా సంచలన వ్యాఖ్యలు
March 27, 2025
ఇటీవల భర్తపై స్వీటీ బూరా దాడి చేస్తున్నట్టుగా ఓ వీడియో
సామాజిక మాధ్యమాల్లో వైరల్
స్పందించిన మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్
మాజీ ప్రపంచ ఛాంపియన్, అంతర్జాతీయ బాక్సర్ స్వీటీ బూరా తన భర్త దీపక్ హుడా ఒక గే (స్వలింగ సంపర్కుడు) అని, అతనికి పురుషులంటేనే ఇష్టమని సంచలన ఆరోపణలు చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో తన భర్తతో ఘర్షణకు దిగినట్లు ఆరోపణలు రావడంతో స్వీటీ బూరా స్పందించారు. సోషల్ మీడియాలో లైవ్ ద్వారా ఆమె మాట్లాడుతూ, తనను కావాలనే చెడుగా చూపిస్తున్నారని, వాస్తవానికి దీపక్ హుడానే తనను గృహ హింసకు గురి చేశాడని అన్నారు.
వీడియోలో ముఖ్యమైన భాగాలు తొలగించారని, దీపక్ హుడా తనను దూషించిన ప్రారంభ, ముగింపు సన్నివేశాలు కూడా లేవని ఆమె ఆరోపించారు. ఆ సంఘటన సమయంలో తనకు పానిక్ ఎటాక్ వచ్చిందని, ఆ భాగాన్ని కూడా తొలగించారని ఆమె తెలిపారు. హిస్సార్ ఎస్పీ కూడా... దీపక్ హుడాకు మద్దతు తెలుపుతున్నారని, పోలీసు స్టేషన్ లో జరిగిన సన్నివేశాల వీడియోను బహిర్గతం చేయడానికి అనుమతించారని బూరా ఆరోపించారు.
తన తండ్రి, మేనమామ ఘర్షణలో పాల్గొనలేదని వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని ఆమె నొక్కి చెప్పారు. నిజానికి, తన మేనమామ గొడవను ఆపడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ, వారిపై ఎందుకు కేసు నమోదు చేశారని ఆమె ప్రశ్నించారు.
స్వీటీ బూరా గతంలో హిస్సార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. విచారణ సమయంలో, ఇరు పార్టీలను మార్చి 15న కౌన్సెలింగ్ కోసం ఎదురెదురుగా కూర్చోబెట్టారు. అయితే, వారి మధ్య వివాదం తలెత్తడంతో స్వీటీ బూరా దీపక్ హుడా చొక్కా పట్టుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో మార్చి 24న వైరల్ అయింది.
దీని తరువాత, దీపక్ హుడా ఫిర్యాదు మేరకు స్వీటీ బూరా, ఆమె తండ్రి మహేందర్ సింగ్, ఆమె మేనమామ సత్యవాన్‌లపై హిస్సార్ సదర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వీటీ బూరా తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి మార్చి 15న మహిళా పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని హుడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌన్సిలింగ్ సమయంలో తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లోపలే తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
హర్యానాకు చెందిన స్వీటీ బూరా మొదట్లో కబడ్డీ క్రీడాకారిణి. అయితే ఆ తర్వాత బాక్సింగ్ కు మారి, అనేక విజయాలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2022లో కబడ్డీ క్రీడాకారుడు దీపక్ హుడాను పెళ్లాడారు.