రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలి
November 22, 2024
అఖిలభారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక
అత్తలూరులో అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ రజక కుటుంబ సభ్యులను పరామర్శించిన అనిల్ కుమార్
బాధితులకు అండగా ఉంటాం
సమస్యల పరిష్కారానికి రజకులందరూ కలిసికట్టుగా ఉద్యమించాలి
అమరావతి, ఎన్ టైమ్స్ న్యూస్: ఆంధ్ర రాష్ట్రంలో నేటికీ అనేక చోట్ల రజకులపై అగ్రవర్ణాల దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తూ వారిని భయం గుప్పెట్లో నివసించేలా చేస్తున్నారని అఖిలభారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక అన్నారు. ఈనెల 13న పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో చిన్న విషయానికి రజక కులానికి చెందిన తురకపల్లి గురవయ్య అతని భార్య కుమారిలపై అగ్రవర్ణానికి చెందిన బయ్యపునేని హనుమయ్య ఆయన కుమారుడు ప్రేమ్ కుమార్ తో సహా కుటుంబ సభ్యులు ముకుముడిగా దాడి చేయడంతో గురవయ్య, కుమారీలకుతలలకు తీవ్రగాయాలు అయ్యి చికిత్స పొంది వారిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని, తమకు రక్షణ కల్పించాలనిరజక సంఘాల నాయకులతో పోరాటం చేస్తున్న గురవయ్య కుటుంబ సభ్యులను శుక్రవారం మొగ్గ అనిల్ కుమార్, అఖిల భారత సంఘ రాష్ట్ర నాయకులు పరామర్శించి కేసు విషయమై స్థానిక పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ రజక మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాలలో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్నప్పటికీ నేటికీ అనేక గ్రామాల్లో రజకులపై దాడులు, గ్రామబహిష్కరణలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో రజకులపై దాడుల పరంపర కొనసాగిందని అన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి వారి విజయంలో కీలక పాత్ర పోషించారని అలాంటి వారిని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రజకులపై దాడులు అరికట్టేందుకు రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఎక్కడ రజకులకు అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసేందుకు పోరాటం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీలకు, గ్రూపులకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేసి విజయం సాధించాలని అనిల్ కుమార్ కోరారు. అగ్రవర్ణాల దాడిలో గాయపడిన గురవయ్య కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర హోం మంత్రి అనితను కలిసి వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. రజక మహిళలు తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా, రజకుల సమస్యల పరిష్కారానికి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులను కలిసి చర్చించి వినతి పత్రం అందిస్తున్నామని ఆయన తెలిపారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లోపర్యటించి
రజకులు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని అఖిలభారత రజక సంఘం బలోపేతానికి కృషి చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అఖిలభారత రజక సంఘం అధ్యక్షులు ప్రశాంత్, ఆంధ్రప్రదేశ్ సంఘం మహిళ అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు శ్రీనివాసులు, లక్ష్మణ్, రఘు, కిట్టు పెదకూరపాడు నియోజకవర్గ రజక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ వాడపర్తి పుల్లారావు, నాయకులు తుమ్మపూడి వెంకయ్య, రజక కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.